Srimad Valmiki Ramayanam

Balakanda Chapter 28

Viswamitra Celestial weapons to Rama- 2!

With Sanskrit text in Telugu , Kannada and Devanagari,

బాలకాండ
ఇరువది ఎనిమిదవ సర్గము
( విశ్వామిత్రుడు శ్రీరామునకు అస్త్ర ఉపహారమంత్రములను ఉపదేశించుట )

ప్రతిగృహ్య తతోsస్త్రాణీ ప్రహౄష్టవదన శ్శుచిః |
గచ్ఛన్నేవ చ కాకుస్థో విశ్వామిత్ర మథబ్రవీత్ ||

తా|| శుచి అయి ఆ అస్త్రములను ప్రతిగ్రహించి ఆ కకుస్థవంశజుడగు శ్రీరాముడు సంతోషముగల వదనముతో పయనించుచూ విశ్వామిత్రునితో ఇట్లనెను.

గృహీతాస్త్రోsస్మి భగవాన్ దురాధర్షః సురాస్సురైః |
అస్త్రాణాం త్వహమిచ్ఛామి సంహారం మునిపుంగవ |

తా||'ఓ భగవన్ ! సురాసురులను గూడా ఎదుర్కొనగల అస్త్రములను గ్రహించితిని . ఓ మునిపుంగవ ఈ అస్త్రములను ఉపసంహరము గురించి తెలుసుకొనుటకు కోరికగలదు'.

ఏవం బ్రువతి కాకుత్ స్థే విశ్వామిత్రో మహామునిః |
సంహారం వ్యాజహారాథ ధృతిమాన్ సువ్రతశ్శుచిః ||

తా|| ఈ విధముగా కకుస్థుడగు శ్రీరాముడు పలుకగా ఆ ధృతిమంతుడు సువ్రతుడు అగు విశ్వామిత్రుడు శుచి అయి ఉపసంహారమంత్రములు ఉపదేశించెను.

సత్యవంతం సత్యకీర్తిం ధృష్టం రభసమేవ చ |
ప్రతిహారతరం నామ పరాజ్ఞ్ముఖమవాజ్ఞ్ముఖమ్ ||
లక్షాక్ష విషమౌ చైవ దృఢనాభసునాభకౌ |
దశాక్షశతవక్త్రౌ చ దశశీర్షశతోదరౌ ||
పద్మనాభ మహాబాహౌ దుందునాభసునాభకౌ |
జ్యోతిషం కృశనం చైవ నైరాశ్యవిమలావుభౌ ||
యోగంధరహరిద్రౌ చ దైత్యప్రశమనౌ తథా |
శుచిబాహుర్మహాబాహుః నిష్కులిర్విరుచిస్తథా |
సార్చిర్మాలీ ధృతిర్మాలీ వృత్తిమాన్ రుచిరస్తథా ||
పితృసౌమనసం చైవ విధూతమకరావుభౌ |
కరవీరకరం చైవ ధనధాన్యౌ చ రాఘవ ||
కామరూపం కామరుచిం మోహమావరణం తథా |
జృంభకం సర్వనాభం చ సంతానవరుణౌ తథా ||

సత్యవంతము, సత్యకీర్థి, ధృష్టం, రభసము , ప్రతిహారతరము అను పేరుగల పరాజ్ఞ్ముఖము అవాజ్ఞ్ముఖము; లక్షాక్షము, విషమము, ధృఢనాభము, సునాభము , దశాక్షము, శతవక్త్రము, దశశీర్షము , శతోదరము ; పద్మనాభము, మహాబాహు, దుందునాభము, సునాభము . జ్యోతిషము, కృశనము, నైరాశ్యము విమలము అనబడు రెండూ; యోగంధరము, హరిద్రము, దైత్యము, ప్రశమనము, శుచిబాహు , మహాబాహు,నిష్కులీ, అలాగే విరుచి' సార్చిమాలి, ధృతిమాలి , వృత్తిమాన్ , అలాగే రుచిరము; పిత్రుసౌమనసము, విధూతము, మకరము, కరవీరకరము, ధనము , ధాన్యము ; కామరూపము, కామరుచి, మోహము, ఆవరణము అలాగే ఝృంభకము, సర్వనాభము, సంతానము, వరుణము ; ఓ రామా !! ఇవి సంహారక మంత్రములు.

భృశాశ్వతనయాన్ రామ భాస్కరాన్ కామరూపిణః |
ప్రతీచ్ఛమమ భద్రం తే పాత్రభూతోsసి రాఘవ ||

తా|| 'ఓ రాఘవా ! కామరూపులగు భృశాశ్వ తనయుల అస్త్రములను ఇచ్చితిని. నీవు వీటిని కూడా గ్రహించుటకు అర్హుడవు. నీకు భద్రమగుగాక'.

బాఢ మిత్యేవ కాకుత్ స్థః ప్రహృష్టే నాంతరాత్మనా |
జగ్రాహ మంత్రగ్రామం తేsప్యుపతస్థుశ్చ రాఘవమ్ ||
దివభాస్వర దేహాశ్చ మూర్తిమంతః సుఖప్రదాః |
కేచిదంగారాసదృశాః కేచిద్దూమోపమోస్తదా ||
చంద్రార్క సదృశాః కేచిత్ ప్రహ్వాంజలిపుటాస్తథా ||
రామం ప్రాంజలయో భూత్వాs బ్రువన్ మధుర భాషిణః |
ఇమే స్మ నరశార్దూల శాధి కిం కరవామ తే ||

తా|| అంతట ఆ కాకుస్థుడు అట్లే అని సంతోషముగా ఆ మంత్రములను స్వీకరించెను. అవికూడా ఆ రాఘవుని చేరెను. అవి దివ్యభాస్వర దేహములతో ఉన్నవీ , సుఖప్రదమైనవీ , కొన్ని అంగారసమానముగా నున్నవీ , కొన్ని ధూమముతో సమానమైనవిగా నున్నవీ , కొన్ని చంద్రునివలె నున్నవీ. అవి అన్నియూ అంజలిఘటించి శ్రీరామునితో మధురభాషణలతో అడిగిరి, " ఓ నరశార్దూలా! నీకు మేము ఏమి చేయవలెను ?" అని

మానసాః కార్య కాలేషు సహాయ్యం మే కరిష్యథ |
గమ్యతామితి తానాహ యథేష్టం రఘునందన ||
అథతే రామమాంత్ర్య కృత్వాచాపి ప్రదక్షిణమ్|
ఏవమస్త్వితి కాకుత్ స్థమ్ ఉక్త్వా జగ్ముర్యథాగతమ్ |

తా|| ' కార్య కాలములో నేను మనస్సులో తలచినవెంటనే నాకు సహాయము చేయుదురుగాక. ఇక మీరు మీ అభీష్ఠ స్థానములకు యదేచ్ఛగా వెళ్ళుడు' అని ఆ రఘునందనుడు ఆదేశించెను. అంతట వారు "అట్లే" అని పలికి , ప్రదక్షిణమొనర్చి తమ యథాస్థానముకు చేరిరి.

తతస్తు రామః కాకుత్ స్థః శాసనాద్బ్రహ్మవాదినః |
లక్ష్మణాయ చ తాన్ సర్వాన్ వరాస్త్రాన్ రఘునందనః |
సంహారాన్ స చ సంహృష్టః శ్రీమాంతస్మైన్యవేదయత్ ||

తా|| పిమ్మట కాకుస్థుడైన శ్రీరాముడు బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుని ఆదేశానుసారాము ఆ అస్త్రములను మరియూ వాటి ఉపసంహార మంత్రములనూ అన్నిటినీ లక్ష్మణునకు ఉపదేశించెను్.

స చ తాన్ రాఘవో జ్ఞాత్వా విశామిత్రం మహామునిమ్ |
గచ్ఛన్నేవాథ మధురం శ్లక్షం వచనమబ్రవీత్ ||

తా|| ఆ రాఘవుడు అన్నిటినీ తెలిసికొని , మహాముని అగు విశ్వామిత్రునితో పయనించుచూ మధురమగు వచనములతో ఇట్లు పలికెను.

కిన్వేతన్మేఘసంకాశం పర్వతస్యవిదూరతః |
వృక్షషండమితో భాతి పరం కౌతూహలం హి మే ||
దర్శనీయం మృగాకీర్ణం మనోరమమతీవ చ |
నానా ప్రకారైః భాతి పరం కౌతూహలం హి మే |
నిస్సృతాః స్మ మునిశ్రేష్ట కాంతారాద్రో మహర్షణాత్ |
అనయాత్వవగచ్ఛామి దేశస్య సుఖవత్తయా |
సర్వం మే శంస భగవన్ కస్యాశ్రమపదం త్విదమ్ ||

తా|| 'ఓ ముని శ్రేష్ఠా ! ఈ పర్వత సమీపమునందు మేఘములను బోలి వృక్షసముదాయమేమి ? నాకు పరమ కుతూహలముగా వుంది.?ఇది వివిధ మృగములతో మనోరమముగా నున్నది. ఇచట నానావిథములైన పక్షుల కిలకిలారావములతో వీనుల విందుగా నున్నది. ఈ ప్రదేశము మిక్కిలి సుఖముగా ఉన్నది. మరియూ మనముఒక భయంకర వనమునుండి బయటపడినట్లున్నది. . ఓ భగవన్ ! ఈ ఆశ్రమపదము ఎవరిది ? నాకు సర్వము విశదీకరింపుడు'.

సంప్రాప్తా యత్ర తే పాపా బ్రహ్మఘ్నా దుష్టచారిణః |
తవ యజ్హస్య విఘ్నాయ దురాత్మానో మహామునే |
భగవన్ తస్య కో దేశః సా యత్ర తవ యాజ్ఞికీ ||

తా|| 'ఓ మహామునీ ! పాపాత్ములు, బ్రహ్మహత్యలు చేయువారు మీ యజ్ఞమునకు విఘ్నములు కలిగించువారు వచ్చెడి ప్రదేశము ఏది ?'

రక్షితవ్యా క్రియా బ్రహ్మన్ మయా వధ్యాశ్చ రాక్షసాః |
ఏతత్సర్వం మునిశ్రేష్ఠ శ్రోతుమిఛ్ఛామ్యహం ప్రభో ||

తా|| ' నేను రాక్షసులను వధించి మీ యజ్ఞమును రక్షింపవలసిన ప్రదేశమేది ? ఇది అంతయూ వినుటకు కోరుచున్నాను'.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే
బాలకాండే అష్టావింశస్సర్గః ||
సమాప్తం ||

|| ఈ విథముగా బాలకాండలోని ఇరువది ఎనిమిదవ సర్గము సమాప్తము.||
|| ఓమ్ తత్ సత్ ||


|| om tat sat ||